పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9082-02 లలిత సం: 04-585 అధ్యాత్మ

పల్లవి:

హితమిదియే కాకిఁక లేదు - మా
గతిఁ జెరి నీకృపె కలదిది యెల్లా

చ. 1:

పాతకకోట్లం బాయునుపాయం
బేతరిఁ జూచిన నిఁక లేదు
చైతన్యాత్మక సకలేశ్వర నీ
చేతిదె ప్రాణుల జీవనమెల్లా

చ. 2:

భవబంధంబులఁ బాయునుపాయం
బివల నవల మారికిఁక లేదు
ధ్రువవరదుఁడ కౌస్తుభధర నీకృప
చవిచేతివె మా సంపద లెల్ల

చ. 3:

పరమ పదం బగపడు విభవము నీ
కరుణే కానిఁక గడలేదు
తిరు వేంకటగిరి దేవుఁడ నీకే
భరము జంతువుల పనులివి యెల్లా