పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9075-01 -- సం: 04-578 కృష్ణ

పల్లవి:

ఈతఁడే హరుఁడు యీతఁడే యజుఁడు
ఈతనికి నీచేఁతలెంత ఘనమటుగాన

చ. 1:

కడుఁ బెక్కు బ్రహ్మాండకటకములు సుడివడిన
కడుపలో నిడుకొన్న ఘనుఁడు
వెడలి పూతకిచంటివిషము దాఁగినయంత
వడిఁ దనకు నేమాయ వట్టిబూమెలు గాక

చ. 2:

ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు
డుల్లసిల్లుచు నీతఁడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుఁడవని నిన్నుఁ బరిణమింతురుగాన

చ. 3:

తిరువేంకటేశ్వరుఁడు దేవదేవోత్తముఁడు
పరిపూర్ణుఁ డచ్యుతుఁ డభవుడు
శరణాగతుల రక్షసేయు వాడను మాఁటి
గురుతుగాఁ దలపోసి కొనియాడఁగా వలసె