పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9066-01 శంకరాభరణం సం: 04-571 దశావతారములు

పల్లవి:

దురితమృత్యువట దొంగలట
సిరివరుఁడట దయసేసీనా

చ. 1:

మలయుచునె చేరిన మధుకైటభులను
సెల నెత్తురు వడిచినయట్ల
ఖలులఁ బిడిచి రక్తము వడిఁగ్రోలక
విలయాంతకుఁడట విడిచీనా

చ. 2:

కారించి కనక కసిపుని నఖములఁ
జీరి కడుపు చించిన యతఁడు
ఈరసపసురల యెముకలు విరువక
వీరసింహుఁడట విడిచీనా

చ. 3:

చెనకి దశముఖుని చేతులుఁ దలలును
చినికండలు గోసిన యతఁడు
ఘనుఁడట తిరువేంకటపతి దుష్టులు
తనువులఁ జెండక తడసీనా