పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9066-02 శ్రీరాగం సం: 04-572 ఇతర దేవతలు

పల్లవి:

ఒక్కఁడవె లోకానకొడయడఁవు నీవె
దిక్కుగా నెవ్వరులేరు తిమ్మినాయఁడా

చ. 1:

బొడ్డుచెర్ల బొమ్మిరెడ్డి పొలమెల్లఁ జేడవెట్టి
గడ్డనుండి పైరువిత్తి కాచుకుండఁగా
దొడ్డగాఁ బండఁగఁ జూచి దోసకారి మొండిదొర
దిడ్డిఁదీసి కొంటఁబోయ తిమ్మినాయఁడా

చ. 2:

పాలకొల్ని చందిరెడ్డి పంటసేయఁ బొద్దులేక
గాలివీటి కాపుఁరానఁ గసుగందఁగా
కోలుపుచు దినమూ నీకొండమీఁది నాయకులు
తీలుపరచేరుగదే తిమ్మినాయఁడా

చ. 3:

కామకొల్ని మారిరెడ్డి కనుచూపువారినెల్ల
కోమలపు చెలుపలు గోరు మొత్తఁగా
ప్రేమముతోఁ గేదారి పెరిగి పండిన పంట
తేమ రేఁగి ఊటువట్టె తిమ్మినాయఁడా

చ. 4:

గుండుఁగంటి దేవిరెడ్డి కొలిచిన వండిపెట్టు
కుండ గాపరింటనింట కూడుమోయఁగా
పండిన బండ్లఁగొట్టి పంటలెల్ల నానాఁటి
తిండికొక్క కొలఁదాయ తిమ్మినాయఁడా

చ. 5:

వెలిగొండ కాపిరెడ్డి వేఁకపు జీవనమెల్ల
తలమోఁచి తిరిపెమై తల్లడించఁగా
తెలిసి యాతనితో నొక్కటిగాఁగ నీగుట్టు
తెలిసె వేంకటగిరి తిమ్మినాయఁడా