పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9058-02 మలహరి సం: 04-570 జోల

పల్లవి:

నిద్దిరించీఁ బాలజలనిధివలెనే
ఒద్దిక శ్రీ రమణునికి నొత్తరే పాదములు

చ. 1:

వేఁగుదాఁక జిత్తగించి విద్దెలెల్లనాదరించి
బాగుగాఁ గృపారసము పంచి పంచి
యేగతిఁ బవళించెనో యెట్ల భోగించెనో
యోగీంద్రవరదుని నూఁచరే వుయ్యాలను

చ. 2:

వాలుగన్నుల రెప్పల వడదాఁకి తను తావి
చాలుకొన నూర్పుకలు చల్లి చల్లి
నీలవర్ణపుగుణము నెరపుచు నొకయింత
కాలము కన్నుల దిప్పీఁ గప్పరే దోమతెర

చ. 3:

సరగున యోగనిద్ర చాలించి లోకమెల్ల
కరుణించఁ దలఁచి వేంకటగిరిపై
అరుదుగ సకలలోకారాధ్యుఁడాయె మించి
విరివి నాలవట్టాలు విసరరే సతులు