పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9058-01 సాళంగం సం: 04-569 దశావతారములు

పల్లవి:

నీవు తురగముమీఁద నేర్పు మెరయ
వేవేలు రూపులై వెదచల్లితపుడు

చ. 1:

పదిలముగ నిరువంకఁ బసిడి పింజల యంప
పొదల తరకసములొరపులు నెరపఁగా
గదయు శంఖంబు చక్రము ధనుః ఖడ్గములు
పదివేలు సూర్యబింబములైనవపుడు

చ. 2:

సొరిది శేషుని పెద్దచుట్టు పెనుఁగేవడము
సిరి దొలఁక నొకచేతఁ జిత్తగించి
దురమునకుఁ దొడవైన ధూమకేతువు చేత
ఇరవైనబల్లెమై యేచెనందవుడు

చ. 3:

కరకజడతో రమాకాంత జయలక్ష్మియై
తొరలి కౌగిఁట నిన్నుఁ దొడికి పట్టి
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని
మెరుఁగుఁగుచకుంభముల మిసిమితో నపుడు