పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦54-01 సామంతం సం: 04-567 కృష్ణ

పల్లవి:

బొడ్డు తామెరలోన గడ్డివయసు పెద్ద
బిడ్డఁ గన్నట్టివాడుఁ పిన్నవాడు

చ. 1:

బిరుసైన దొకకొండ పెనుబాముతోఁ జుట్టి
బిరబిరనె త్రిప్పే పిన్నవాఁడు
గురుతైనదొకకొండ గొడగుగా నొకచేత
పెరికి పట్టేవాఁడు పిన్నవాఁడు

చ. 2:

బెడిదంపు శిశుపాలు పెనుమోఁతతోగూడ
పెడచేతనే వేసెఁ బిన్నవాఁడు
పడవేసి చాణూరుఁ బట్టి యురము దొక్కి
పిడికిటనే చంపే పిన్నవాఁడు

చ. 3:

ఎక్కడఁ జూచినఁ నింతటఁ దానై
పెక్కురూపములైన పిన్నవాఁడు
ఇక్కడఁ దిరువేంకటేశుఁడై జగమెల్ల
పిక్కిటిల్లినవాడు పిన్నవాఁడు