పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦53-01 సామంతం సం: 04-566 వైరాగ్య చింత

పల్లవి:

సంతత దుఃఖపు జడులాల శ్రీ
కాంతుని మరవక కనరాదా

చ. 1:

మలజలధులఁ బలుమరుఁ దేలుచుఁ గడు
దలఁకుచు నొరలుఁ బాతకులార
నలువున శ్రీహరి నామామృతమే
కొలఁది మీరఁ బేర్కొనరాదా

చ. 2:

భవ పంకము లోపలఁ బడి ముణుగుచు
చవి దలఁచెడి దుర్జనులాల
భవరోగములకుఁ బండితుఁడవు మా
ధవుని నాత్మఁ జెందగఁరాదా

చ. 3:

కడుఘోరపు మార్గంబున నలయుచు
వడినేఁగెడి తెరువరులాల
చెడని పదవొసఁగు శ్రీవేంకటపతిఁ
దడవి సుఖముల జెందఁగరాదా