పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0310-02 శ్రీరాగం సం: 04-056 వైష్ణవ భక్తి


పల్లవి :

కాకున్న మాపాటు కడమున్నదా
నీకృపవంకనే నిలిచితిఁగాక


చ. 1:

యీ నాలికేకాదా యిందరి నిందించినది
శ్రీనిధి నిన్నుఁ బొగడి చెలఁగెఁ గాక
నానాపాపములు విన్న నా వీనులే కావా
దానవారి నీ కథల ధన్యమాయఁగాక


చ. 2:

యీ మేనేకాదా హేయపుటింతులఁ గూడె
నీముద్రలు ధరియించి నిక్కెఁగాక
యీ మనసేకాదా యిన్నిటిపైఁ బారినది
కామించి నిన్నుఁ దలఁచి కట్టువడెఁ గాక


చ. 3:

యీ పుట్టుగేకాదా హీనాధికములఁ బొందె
వోపి నీ దాస్యము చేరి వొప్పెఁగాక
యేపున శ్రీవేంకటేశ యిన్నినేరములు నాకుఁ
బాపఁగా నే నిన్ను నమ్మి బ్రదికితిఁగాక