పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0310-01 మాళవిగౌళ సం: 04-055 తేరు


పల్లవి :

నానావర్ణముల నడగొండవలెను
దానవారి తేరదె తగ తిరువీధుల


చ. 1:

కదలే కదలె నదె గరుడధ్వజునితేరు
అదె మిన్నుమోచిన నీలాద్రివలెను
యెదిరె నెదిరె నదె యిందిరాధిపుని తేరు
కదిసి చుక్కలు మోచే కనకాద్రివలెను


చ. 2:

తిరిగె తిరిగె నదె దేవుదేవునితేరు
అరుదైన ఘనమందరాద్రివలెను
పరువులిడీ నదె పట్టపు శ్రీపతితేరు
విరిఁవి గైలాసపు వెండికొండవలెను


చ. 3:

దగ్గరె దగ్గరె నదె దైవశిఖామణితేరు
అగ్గలపు శ్రీవేంకటాద్రివలెను
అర్థమై శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడె
తగ్గులేని మొత్తపు దొంతరకొండవలెను