పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦47-02 సామంతం సం: 04-560 వైరాగ్య చింత

పల్లవి:

ఏమిసేయవచ్చుఁ గర్మమిచ్చినంత కాని లేదు
తాముసేసినంత వట్టు తమకుఁ బోరాదు

చ. 1:

ఇట్టు నట్టు మిట్టిపడ్డ నించుకంతా లేదు - వీఁపు
పట్టగట్ట మోఁపు మోఁచి పాటువడ్డ లేదు
తట్టువడ లోకమెల్ల దవ్వుకొన్న లేదు
తెట్ట తెరువున నోరుదెరచిన లేదు

చ. 2:

అడిగిపరుల బతుకాసపడ్డ లేదు - భీతి
విడిచి నెత్తుటఁ దోఁగి వీరుఁడైన లేదు
అడవులెల్లఁ దిరిగి అలమటించిన లేదు
ఇడుమపాటుఁజొచ్చి యియ్యకొన్న లేదు

చ. 3:

వచ్చి వచ్చి వనితల వలపించుకొన్న లేదు
మెచ్చుల గుఱ్ఱమునెక్కి మేటియైన లేదు
ఎచ్చరక దిరువేంకటేశు గొలువకుంటే
ఇచ్చటచ్చట సుఖమించుకంత లేదు