పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦46-01 ఆహిరి సం: 04-558 వైరాగ్య చింత

పల్లవి:

చాలదా నా సంసారము
గాలియుయ్యెలలఁ దొలఁగక యూఁగవలసె

చ. 1:

పాపపుణ్యములనెడి బల్లిదుల వెంటనే
దీపించు బంటనై తిరిగి తిరిగి
పైపైనె దేహంపుఁ బల్లెలొసఁగిన నరక
కూపముల మడి దున్నుకొని బ్రదుకవలసె

చ. 2:

చిత్తమను విభుఁజేరి చెలఁగి విషయంబులకు
కొత్తగమికాడనై కొలిచి కొలిచి
హత్తుకొని మోహంబులను ప్రధానుల యెదుట
గత్తంపు మొగసాలఁ గలదించవలసె

చ. 3:

గాటంపు దురితములకై జీతగాఁడనై
చేటైన కోరికలఁ జేరిచేరి
ఈటాడఁ దిరు వేంకటేశుఁ గనకిన్నాళ్ళు
కోటకొమ్మలకెగసి గుంపించవలసె