పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9042-01 ఆహిరి సం: 04-557 అధ్యాత్మ

పల్లవి:

ఇట్టి సంసారికేదియు లేదాఁయ
తట్టువడుటేకాని దరిచేరలేదు

చ. 1:

ములిగి భారపుమోపు మోఁచేటివాఁడు
అలసి దించుకొను నాడాడను
అలరు సంసారికి నదియు లేదాయ
తొలఁగని భారమెందును దించలేదు

చ. 2:

తడవి వేఁపచేఁదు త్రావెడివాఁడు
ఎడయెడఁ దినుఁ దీపేమైనను
అడరు సంసారికి నదియు లేదాయ
కడుఁ జేఁదెకాని యెక్కడఁ దీపులేదు

చ. 3:

దొరకొని హేయమే తోఁడేటివాఁడు
పరిఠవించును మేనఁ బరిమళము
అరిది సంసారికి నదియు లేదాయ
ఇరవు వేంకటపతి నెఱుఁగలేఁడు