పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9037-01 సామంతం సం: 04-556 శరణాగతి

పల్లవి:

ధనముగని మరికదా ధనికుఁడౌట - మొదల
తనుఁ దానెఱుఁగలేని తలుపేఁటి తలఁపు

చ. 1:

మచ్చికల నినుఁగొలిచి మరికదా సుఖులౌట
యెచ్చోట నేవేల్పులెవ్వరైన
అచ్చుపడ నటువంటి హరి నిన్నుఁ గొలిచి నీ
మెచ్చువడయఁగలేని మేలేఁటి మేలు

చ. 2:

కందువగ నినుఁ గొలువఁగనికదా ఘనులౌట
యెందునరుదగు వేల్పులెందరైన
అందముగ పరదైవమని నిన్నుఁ గనలేక
గొందిఁబడి పొరలేటి కూడేఁటి కూడు

చ. 3:

వేరక నినుగొలిచి వేంకటనగేశ నీ
దాసులై మరికదా ధన్యులౌట
వాసి వట్టముకొరకు వదలి దినములచేతఁ
బాసి పోయినవెనక పరమేడ పరము