పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9034-01 సామంతం సం: 04-553 అధ్యాత్మ

పల్లవి:

లోకములోపల లూటిబెట్టి - ఇది
కైకొని హరి యెరఁగవుగా నీవు

చ. 1:

ములుగుచు వెనకయు ముందరయును నొచ్చి
పలుమారుఁ గుంటెడి వసురము
నెలకొని వెదకేము నిన్నమాపటినుండి
నలిననాభుఁడ కానవుగా నీవు

చ. 2:

భంగించి తొల్లియు బలుమారు గొనిపోయి
దొంగలు విడిచిన తురగము
ముంగిటలేదు యేమూల నొదిగినదో
అంగజపతి అరయవుగా నీవు

చ. 3:

కొంకక యడవి మాఁకులుఁ గంపలు మేసి
బింక మెడలి పారు పెనుమృగము
వేంకటపతి దీని వెదకి కానలేము
సంకె వాయుఁ దేర్చవుగా నీవు