పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9029-02 సామంతం సం: 04-548 వైరాగ్య చింత

పల్లవి:

కొంచపడితినొక కొన్నాళ్ళు
ఇంచుకించుకిపుడెరిఁగితి నేను

చ. 1:

ముట్టుపాఁతవలె మురిగిన దేహము
గుట్టున దాఁచితి గొన్నాళ్ళు
ఇట్టే సుఖమని యిన్నిటి యోనుల
ఒట్టుక కాఁపురముండితి నేను

చ. 2:

మురికి కడువలే ముంచిన హేయము
కురిసితి నేనొక కొన్నాళ్ళు
తెరపి లేక యీ దేహమురోఁతల
మొరఁగి దాఁచితిని మూలల నేను

చ. 3:

విప్పుచు ముడుచుచు వెంట్రుకతుట్టెల
కొప్పులె పెట్టితి గొన్నాళ్ళు
అప్ప వేంకటనగాధిప మీకృప
యిప్పుడు వెలసితి నిదివో నేఁడు