పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦28-02 సామంతం సం: 04-545 అద్వైతము

పల్లవి:

ఏమనవచ్చును గొందరికింపౌఁ బులుసులుఁదీపులు
సోమరితనమున నిన్నిటఁ జొరదీ నా తలఁపు

చ. 1:

పదిలంబుగ సర్వాత్మక భావము దలఁచినపిమ్మట
ముదమున నెవ్వరిఁ జూచిన మొక్కక పోరాదు
వదలక యిన్నిటను శ్రీవల్లభుఁడున్నాఁడుండిన
హృదయము చంచలమిన్నిట నెనయదు నామనసు

చ. 2:

ఎక్కడఁ జూచినఁ బ్రాణులకిన్నియు నాచారములే
చిక్కక యిన్నియుఁగైకొని చేయక పోరాదు
మక్కువ నిన్నియు శ్రీ హరి మతములె కానీ అయినా
ఒక్కటియే చాలును నాకొడఁబడవితరములు

చ. 3:

ఏరీతులనటు చూచిన నిందరు బలుదైవములే
కూరిమినందరినటువలెఁ గొలువకపోరాదు
ధారుణి వేంకటపతిచేఁతలు ఇవియైనాఁగాని
కోరిక నా కితఁడే మరి కొరకొరలిన్నియును