పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9028-01 భూపాళం సం: 04-544 వైరాగ్య చింత

పల్లవి:

ఏమో తెలిసెఁ గాని యీ జీవుఁడు
నేమపు నెరవిద్య నేరఁడాయ

చ. 1:

కపటాలే నేరిచెఁ గాని జీవుఁడు
ఎపుడైన నిజ సుఖం బెరఁగఁడాయ
కపురులే చవిగొనె గాని జీవుఁడు
అపరిమితామృత మానఁడాయ

చ. 2:

కడలేక తిరిగీఁ గాని జీవుఁడీ
నడుమ మొదలు చూచి నడవఁడాయ
కడుపుకూటికిఁ బోయీఁ గాని జీవుఁడీ
చెడని జీతముపొంతఁ జేరఁడాయ

చ. 3:

కనియుఁ గానక పోయె గాని జీవుఁడు
దినము వేంకటపతిఁ దెలియఁడాయ
కనుమాయలకె చొక్కెఁ గాని జీవుడు
తనియ నిట్టేమంచి దరిఁ జేరడాయ