పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9016-01 రామక్రియ సం: 04-534 అధ్యాత్మ

పల్లవి:

అందరి వసమా హరి నెరుఁగ
కందువగ నొకఁడుగాని యెరఁగఁడు

చ. 1:

లలితపు పది గోట్ల నొకఁడుగాని
కలుగఁడు శ్రీ హరిఁ గని మనఁగ
ఒలిసి తెలియు పుఖ్యుల కోట్లలో
ఇలనొకఁడుగాని యెరఁగడు హరిని

చ. 2:

శ్రుతి చదివిన భూసుర కోట్లలో
గతియును హరినె యొకానొకఁడు
అతి ఘనులట్టి మహాత్మ కోటిలో
తతి నొకఁడుగాని తలఁచఁడు హరిని

చ. 3:

తుది కెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగు నొకడు తలపున హరిని
గుదిగొను హరి భక్తుల కోట్లలో
వెదకు నొకఁడు శ్రీ వేంకటపతిని