పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9013-01 శ్రీరాగం సం: 04-533 నృసింహ

పల్లవి:

వెరపు దెలుపునీ వేగిరిమే నీ
వెఱిఁగియు నెఱఁగక యేమంటివో

చ. 1:

గోరపురుధిరము గురియు గోళ్ళ నీ
తోరమైన యా తొడమీఁద
గోరంటగోళ్ళ కోమలి నిలువఁగ
ఈరసమందక యేమంటివో

చ. 2:

నెత్తురుఁ బెదవుల నీ మొకమలరఁగ
బిత్తరి వీడెపుఁ బెదవులతో
మత్తకరిగమన మాటలాడఁగా
ఎత్తిన మదమున నేమంటినో

చ. 3:

ఆననరౌద్రము నట్టహాసమును
పూనిన నినుఁగని బొమముడితో
లేనగవుల నదలింపెడి సిరితో
హీనాధికముల నేమంటివో

చ. 4:

పెద పెద యూర్పుల పేగుల జందెపు
టుదరముతో నీవుండుచును
చెదరిన పయ్యెద చెరఁగు జారుసతి
యెదురెదురను నీవేమంటివో

చ. 5:

చింప నెరుల నీ శిరసు ముడుచుకొని
కంపముడిగి వేంకటపతివై
లంపటమందుచు లక్షీసతితో
ఇంపులు నెరపుచు నేమంటివో