పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-05 శంకరాభరణం సం: 04-518 రామ

పల్లవి:

వినుఁ డిదె రఘుపతి విజయములు
పనుపడి రాక్షస బాధ లుడిగెను

చ. 1:

కులగిరు లదరెను కుంభిని వడఁకెను
యిల రాముఁడు రథమెక్కినను
కలఁగె వారిధులు కంపించె జగములు
బలు విలునమ్ములు వట్టినను

చ. 2:

పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె
తొడిఁబడి బాణము దొడిగినను
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు
యెడపక రావణు నేసినను

చ. 3:

చుక్కలు డుల్లెను స్రుక్కె భూతములు
తొక్కి యసుర తల దుంచినను
గక్కన శ్రీ వేంకటగిరి నిలువఁగ
అక్కజమగు శుభ మందరి కొదవె