పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-06 బౌళిరామక్రియ సం: 04-519 రామ

పల్లవి:

ఇతఁడే పరబ్రహ్మ మిదియే రామకథ
శత కోటి విస్తరము సర్వ పుణ్య ఫలము

చ. 1:

ధరలో రాముఁడు పుట్టె ధరణిజఁ బెండ్లాడె
అరణ్య వాసుల కెల్లా నభయమిచ్చె
సొరిది ముక్కుఁ జెవులు చుప్పనాతిని గోసె
ఖర దూషణులను ఖండించి వేసె

చ. 2:

కినసి వాలిఁ జంపి కిష్కింధ సుగ్రీవు కిచ్చె
వనధి బంధించి దాఁటె వానరులతో
కనలి రావణ కుంభ కర్ణాదులను జంపి
వనితఁ జేకొని మళ్ళి వచ్చె నయోధ్యకును

చ. 3:

సౌమిత్రియు భరతుఁడు శత్రుఘ్నుఁడుఁ గొలువఁగ
భూమి యేలె కుశలవ పుత్రలఁ గాంచె
శ్రీ మంతుఁడై నిలిచె శ్రీ వేంకటాద్రిమీఁద
కామించి విభీషణ లంకకుఁ బట్టము గట్టె