పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-03 సామంతం సం: 04-516 అధ్యాత్మ

పల్లవి:

అదిగాన నీతి శాంతాలన్నిటకిఁ గారణము
పదిలమై వివేకించి బ్రదుకఁగ వలయు

చ. 1:

తఱచు మాఁటలాడితే తప్పులెన్నైనాఁ దొరలు
పఱచై తిరిగితేను పాప మంటును
మెఱసి తిరిగాడితే మిక్కిలి దూరు ముట్టు
యెఱకగలవాఁ డిందు నేమఱ డెప్పుడును

చ. 2:

కన్నవెల్లాఁ జూచితే కడునాస లుప్పతిలు
కన్నెలు పెక్కుగూడితే కరఁగు మేను
సన్నలు సారెకునైతే చవుకౌ దొరతనము
యిన్నిట నేర్పరైనవాఁ డేమఱఁ డెప్పుడును

చ. 3:

మట్టుమీరి నవ్వితే మచ్చరా లూరకే పుట్టు
గుట్టులేక నడచితేఁ గొంచపడును
నెట్టినె శ్రీ వేంకటేశ నీకు శరణుచొచ్చి
యిట్టె నీ దాసుఁడైనవాఁ డేమరఁ డెప్పుడును