పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-02 రామక్రియ సం: 04-515 రామ

పల్లవి:

రాముఁడు లోకాభిరాముఁడు వీఁడిగో
వేమారు మొక్కుచు సేవించరో జనులు

చ. 1:

చెలువపు రూపమున జితకాముఁడు
మలసీ బిరుదున సమర భీముఁడు
పొలుపైన సాకేతపుర ధాముఁడు
యిలలోఁ బ్రజలకెల్లా హిమధాముఁడు

చ. 2:

ఘనకాంతుల నీల మేఘ శ్యాముఁడు
అనిశము నుతుల సహస్ర నాముఁడు
కనుపట్టు కపి నాయక స్తోముఁడు
తనునెంచితే దేవతా సౌర్వభౌముఁడు

చ. 3:

సిరుల మించిన తులసీ దాముఁడు
కరుణానిధియైన భక్త ప్రేముఁడు
వురుతర మహిమల నుద్దాముఁడు
గరిమల శ్రీ వేంకటగిరి గ్రాముఁడు