పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0౩89-01 మాళవిగౌళ సం: 04-514 రామ

పల్లవి:

అదె లంక సాధించె నవని భారము దించె
విదితమై ప్రతాపము వెలయించె నితఁడు

చ. 1:

రవి వంశ తిలకుఁడు రాముఁ డితఁడు
భువిఁ బుట్టె దశరథ పుత్రుఁ డితఁడు
భవుఁడెంచెఁ దారక బ్రహ్మ మీతఁడు
పవనజు కిచ్చినాఁడు బ్రహ్మపట్ట మీతఁడు

చ. 2:

బలువుఁడు సీతాపతి యితఁడు
తలకొన్న వాలి మర్దనుఁ డితఁడు
విలసిల్లె నేకాంగ వీరుఁ డితఁడు
చలమరి కోదండ దీక్షా గురుఁ డితఁడు

చ. 3:

శరణాగత వజ్రపంజరుఁ డితఁడు
సరిలేని యసుర భంజకుఁ డితఁడు
వరదుఁడు శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడు
అరయ విజయనగరాధీశుఁ డీతఁడు