పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0387-06 బౌళి సం: 04-509 హనుమ

పల్లవి:

అదె చూడరయ్యా పెద్ద హనుమంతుని
గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా

చ. 1:

వుదయాస్త శైలములు వొక జంగగాఁ జాఁచె
అదివో ధ్రువ మండల మందె శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
యెదుట నీతని మహి మేమని చెప్పేమయ్యా

చ. 2:

దండిగా బ్రహ్మాండముదాఁకఁ దోఁక మీఁదికెత్తె
మెండగు దిక్కులు నిండ మేను వెంచెను
గుండుగూడ రాకాసులఁ గొట్టఁగఁ జేతులు చాఁచె
అండనీతని ప్రతాప మరుదరుదయ్యా

చ. 3:

దిక్కులు పిక్కటిలఁగ దేహరోమములు వెంచె
పక్కన లోకములకుఁ బ్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరిబంటాయ
మిక్కిలి నీతనిలావు మేలు మేలయ్యా