పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-05 నాట సం: 04-508 నృసింహ

పల్లవి:

ఇట్టి సుద్దులితనివి ఇదివో కొలువున్నాఁడు
నట్టనడుమ నీ సుగ్రీవ నారసింహుఁడు

చ. 1:

పగలూ రాతిరీఁ గాని పటు సంధ్యా కాలమందు
మొగిఁ బచ్చీ వెచ్చీగాని మొనగోళ్ళచే
గగనమూ నేలాఁ గాని గనమైన తొడమీఁద
నగుతా హిరణ్యుఁ గొట్టె నరసింహ దేవుఁడు

చ. 2:

వెలుపలా లోనాఁ గాని వెడఁగుగడపమీఁద
తలి తండ్రి గాని యట్టి తావునఁ బుట్టి
మొలచి చిగిరించని ముదురుఁగోరలతోడ
నలి హిరణ్యు జంకించె నరసింహ దేవుఁడు

చ. 3:

మానిసీ మెకమూఁగాని మంచి యాకారముతోడ
పూని యిల్లూఁ బందిలీఁ గాని గుహలో
ఆనుక హిరణ్యుని నడఁచీ శ్రీ వేంకటాద్రి
నానా దిక్కుల నేలిన నరసింహ దేవుఁడు