పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-02 రామక్రియ సం: 04-505 నృసింహ

పల్లవి:

అల్లవాఁడే గద్దె మీఁద నౌభళపు గుహలోన
యెల్లవారిఁ గరుణతో నేలుకొన్నాఁడు

చ. 1:

వుక్కుఁగంభములోఁ బుట్టి వుగ్రనారసింహుఁడు
మొక్కలపు హిరణ్యుని ముందలవట్టి
గక్కనఁ గడుపు చించి ఘనమైన పేగులు
వెక్కసపు జంధ్యాలుగా వేసుకొన్నాఁడు

చ. 2:

కోరలు దీఁడుకొంటాను ఘోర నారసింహుఁడు
సారె సారె నెత్తురులు చల్లుకొంటాను
వీరులైన దానవుల వెదకి వెదకి కొట్టి
గోరి కొనఁ గండలెల్లాఁ గోయుచున్నాఁడు

చ. 3:

విచ్చిన విడిని శ్రీ వేంకటనారసింహుఁడు
పచ్చిదేర నట్టే పకపక నవ్వి
కచ్చు పెట్టి దేవతలఁగాచి యభియమిచ్చి
పెచ్చు రేఁగి సంతోసానఁ బెరుగుచున్నాఁడు