పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-03 మాళవిగౌళ సం: 04-506 హనుమ

పల్లవి:

ఎంతని పొగడవచ్చు నీతని సేవించరో
పొంతనిదే కలశాపుర హనుమంతుఁడు

చ. 1:

పిడికిటఁ బట్టినవి పెద్దపండుల గొలలు
అడరి యెత్తినది మహావాలము
గుడిగొన రాకాసులఁ గొట్టినది వలకేలు
పొడచూపీఁ గలశాపుర హనుమంతుఁడు

చ. 2:

సందడి సమరానకు చాఁచినది పెనుజంగ
అందముగ నిక్కించినదదే వురము
కుందక వీర రసమే కురిసేటిది మొగము
పొందగువాఁడు కలశాపుర హనుమంతుఁడు

చ. 3:

వుదుటన మెలఁగేవి వొద్దికైన పాదాలు
త్రిదశుల మెప్పించేది దివ్యరూపము
అదె శ్రీ వేంకటేశు బంటయి నిలుచున్నాఁడు
వొదలుచుఁ గళశాపుర హనుమంతుఁడు