పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0387-01 లలిత సం: 04-504

పల్లవి:

కంటిమి నేఁ డిదె గరుడా చలపతి
యింటి వేలుపగు యీశ్వరుఁ డితఁడు

చ. 1:

శ్రీ నరసింహుఁడు చిన్మయ కాంతుఁడు
దానవాంతకుఁడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనుక కాచే పోషకుఁ డితఁడు

చ. 2:

దేవాది దేవుఁడు దినకర తేజుఁడు
జీవాంత రంగుఁడు శ్రీ విభుఁడు
దైవ శిఖామణి తలఁచినవారిని
సేవలు గొని కాచే విభుఁడితఁడు

చ. 3:

పరమమూర్తి హరి ప్రహ్లాదవరదుఁడు
కరుణానిధి బుధ కల్పకము
పరగు శ్రీ వేంకటపతి తన దాసుల-
నరుదుగఁ గాచే యనంతుఁ డితఁడు