పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-06 లలిత సం: 04-503 రామ

పల్లవి:

సర్వరక్షకుఁడైన సర్వేశుఁడేకాక
వుర్విమీఁద నందరిలో నొక్కఁడా రాముఁడు

చ. 1:

కొండ పొడవులైన ఘోర వానర బలము
గుండుగా వారిధి దండఁ గూడఁబెట్టి
నిండు జెలనిధి గట్టి నిగిడి లంక సాధించె
అండనే రాముఁడు నరుఁ డనవచ్చునా

చ. 2:

అన్నిటా దేవతలకు నసాధ్యమైన రావణు -
నెన్నికగాఁ బుత్ర మిత్ర హితుల తోడ
పన్నుకొని శస్త్రాస్త్ర పంక్తులనే ఖండించె
సన్నుతి నిట్టే రాముని జనుఁడన వచ్చునా

చ. 3:

చలపట్టి లంక విభీషణునికిఁ బాలించి
బలువుగ సీతఁగూడి పట్టమేలి
యిలలో శ్రీ వేంకటాద్రి నిరవై లోకము గాచీ
నలువంక రాముఁడు నరుఁడనవచ్చునా