పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-04 బౌళి సం: 04-501 హనుమ

పల్లవి:

ఎంతని పొగడవచ్చు నితని ప్రతాపము
పంతము లెల్లా మెరసి ప్రతాపించీ వాఁడే

చ. 1:

చేతులనే పెరికి సంజీవి కొండ దెచ్చినాఁడు
ఆతఁడువో తొల్లి పెద్ద హనుమంతుఁడు
ఘాతలఁ దానొక్కఁడే లంక సాధించి వార్ధి దాఁటి
యీతలకి వచ్చినాఁడు ఇదివో వాఁడే

చ. 2:

ముదమున బ్రహ్మ లోకము దాఁకాఁ బెరిగినాఁడు
అదివో ఇప్పుడు పెద్ద హనుమంతుఁడు
వదలక తోఁక చక్రవాళ పర్వతము వెంటా
వుదుటునఁ జుట్టుకొని వున్నాఁడు వాఁడే

చ. 3:

మెల్లనే జంగ చాచి మెడ నిక్కించుకొన్నాఁడు
అల్లదివో మించే పెద్ద హనుమంతుఁడు
వెల్లవిరైనాఁడు శ్రీ వేంకటేశ్వరుని బంటై
చల్లఁగా లోకములేలీ సంతతము వాఁడే