పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0386-03 సాళంగనాట సం: 04-500 నృసింహ

పల్లవి:

సేవించరో జనులాల చేతులెత్తి మొక్కరో
వావిరిఁ బ్రహ్లాదునికి వరదుఁడు వీఁడే

చ. 1:

జగన్నాథుఁడు వీఁడే సర్వరక్షకుఁడు వీఁడే
నిగమవేద్యుఁడైన నిత్యుఁడు వీఁడే
సగుణవంతుఁడు వీఁడే సర్వకాముఁడు వీఁడే
నగు మొగము సుగ్రీవ నరసింహుఁడు వీఁడే

చ. 2:

మరు జనకుఁడు వీఁడే మహిమాధికుఁడు వీఁడే
పరగ శ్రీ లక్ష్మీపతి వీఁడే
సురల కేలికె వీఁడే శుభ మూరితి వీఁడే
నరసఖుఁడ సుగ్రీవ నరసింహుఁడు వీఁడే

చ. 3:

భువనాధిపతి వీఁడే పురుషోత్తముఁడు వీఁడే
వివిధ ప్రతాప కోవిదుఁడు వీఁడే
ఇవల శ్రీ వేంకటాద్రి నిరవైనతఁడు వీఁడే
నవమూర్తి సుగ్రీవ నరసింహుఁడు వీఁడే