పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-04 గుజ్జరి సం: 04-473 మాయ

పల్లవి:

హేయ మేమీలేదు జగమింతా రుచికరమే
మాయావికార మిది మనసెట్టి రోసును

చ. 1:

కాయధారణము లింపు కాంతలభోగము లింపు
ఆయతమై వారివారి యాహారా లింపు
సోయగపుఁ గన్నులను చూచేటి వేఁడుక లింపు
చాయ మనసొడఁబడి సమ్మతించితేను

చ. 2:

పలుకులెల్లా నింపు భావములెల్లా నింపు
చెలరేఁగి తమ తమ చేఁత లింపు
జలమల సంగతుల సహజము లవి యింపు
వొలిసి తమ మనసొడఁబడి తేను

చ. 3:

తగిన జన్మము లింపు తమ చక్కఁదనా లింపు
జగతి వారికి వారి జాతు లింపు
నిగిడి శ్రీ వేంకటేశ నీ మహిమలే యివి
వొగరు లేక మనసొడఁబడి వుంటేను