పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-03 సాళంగనాట సం: 04-472 రామ

పల్లవి:

చిత్తా అవధారు జియ్య పరా కెచ్చరికె
హత్తి కానుక లిచ్చేరు అదె రాజరాజులు

చ. 1:

రామ రఘ కుల వీర రాజీవ లోచన
కోమల శ్యామల వర్ణ కొలువు వేళ
వామ దేవాది మునులు వారె, సుగ్రీవుఁడు వాఁడె
వేమారును వానర వీరులు మొక్కేరు

చ. 2:

దేవ సీతాస మేత ధీర లోక నాయక
భావించ నవధరించు పౌఁజువేళ
పావని యల్లవాఁడె భల్లూకపతి వీఁడె
సేవించీని భరతునిఁ జేకొను శత్రుఘ్నుని

చ. 3:

శ్రీమదయోధ్యా విహార శ్రీ వేంకటనివాస
సామజ వాజి రథాల సందడివేళ
సౌమిత్రి యీవంక విభీషణుఁడు నావలివంక
నీ మహిమలెల్లా మెచ్చి నీకు విన్నవించేరు