పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-06 తోడి సం: 04-469 నృసింహ

పల్లవి:

సుగ్రీవ నారసిఁహ సులభుఁడ వందరికి -
నగ్రేసరుఁడ నీ వవధారు దేవా

చ. 1:

సనకాదు లొకవంక జయవెట్టుచున్నారు
యెనసి సురలు చేతులెత్తి మొక్కేరు
మును లిరుమేలానుండి మునుకొని నుతించేరు
అనుపమాలంకార అవధారు దేవా

చ. 2:

గంగాది నదు లెల్లఁ గడిగీ నీ పాదములు
పొంగుచు సప్త రుషులు పూజించేరు
సంగతి వాయుదేఁడు సరినాల వట్టమిడీ
అంగజ కోటి రూప యవధారు దేవా

చ. 3:

పరగ నారదాదులు పాడేరు నీ చరితలు
పరమ యోగీంద్రులు భావించేరు
సిరులు మించిన యట్టి శ్రీ వేంకటాద్రిమీఁద-
నరుదుగ నున్నాఁడవు అవధారు దేవా