పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-05 లలిత సం: 04-468 కృష్ణ

పల్లవి:

వేవేల చందాలవాఁడు విఠలేశుఁడు
భావించ నలవిగాని పరమాత్ముఁ డితఁడు

చ. 1:

సతతము రుక్మిణీ సత్యభామల నడుమ
రతికెక్కిన సింగారరాయఁ డితఁడు
చతురత సనకాది సంయమీంద్రులమతి-
నతిశయిల్లేటి పరమానంద మితఁడు

చ. 2:

దేవతల కెల్లాను దిక్కు దెసై వెలఁగొంది
తావుకొన్న యట్టి యాధార మీతఁడు
మూవంక గొల్లెతలు మున్ను సేసిన తపము
కైవశమై ఫలించిన ఘన భాగ్య మితఁడు

చ. 3:

వరముతో యశోద వసు దేవాదులకు
పరగిన కన్నులపండు గీతఁడు
పిరులు మించినయట్టి శ్రీ వేంకటాద్రిమీఁది-
నిరతి దాసుల పాలి నిధాన మితఁడు