పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-01 మాళవి సం: 04-470 హనుమ

పల్లవి:

అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపము
సురలకు నరుల కీ సుద్దు లెందుఁ గలవా

చ. 1:

వుదయాచలము మీఁది నొక్కజంగ చాఁచుకొని
వుదుటున నపరాద్రి నొక్కజంగ చాఁచుకొని
తుద సూర్యమండలము తోడ మోము దిప్పుకొంటా
పెదవులెత్తి చదివెఁ బెద్ద హనుమంతుఁడు

చ. 2:

వొక్క మొలగంట చంద్రు డొక్క మొలగంట రవి
చుక్కలు మొలపూసలై చూపట్టఁగా
నిక్కిన వాలాగ్రమందు నిండిన బ్రహ్మలోకము
పిక్కటిల్లఁ బెరిగెను పెద్ద హనుమంతుఁడు

చ. 3:

పడికిలించిన చేత బిరుదుల పండ్ల గొల
తడయక కుడి చేత దశ దిక్కుల
జడియక శ్రీ వేంకటేశ్వరునిమన్ననబంటు
బెడిదపు మహిమల పెద్ద హనుమంతుఁడు