పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0308-02 గౌళ సం: 04-044 శరణాగతి

పల్లవి:

హరి నీవాఁడనే కానా ఆదికాలమున నేను
గరిమ నీమాయలోనే కలగంటిఁగాక

చ. 1:

యీమేనే కాదా హేయమెల్లా మోచినది
ఆమీఁదఁ బుణ్యతీర్థము లాడీఁగాక
కామించి యీరెంటి సంగాతంబు నేఁజేసి
గామిడినై యెందువాఁడాఁ గానైతిఁగాక

చ. 2:

చిత్తమిదే కాదా చింతించెఁ బాపాలు దొల్లి
పొత్తుల పుణ్యాలు దలపోసీఁగాక
రిత్తకు రిత్తయి యీరెంటి నడుమను జిక్కి
కత్తరపు రొంపి లోని కంబ మైతిఁగాక

చ. 3:

యీ నాలుకే కాదా యిందరినిఁ బొగడేది
తానకపు వేదములు తడవీఁగాక
వూనిన శ్రీవేంకటేశ వొంటి నీకు శరణని
తోనే యా రెండుఁ గడచి తుద కెక్కేఁగాక