పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0308-01 లలిత సం: 04-043 శరణాగతి

పల్లవి:

హీనాధికము లింక నేడ నున్నవో కాని
ఆనిన దాస్యము పొత్తు అందరికి నొకటే

చ. 1:

నానావర్ణములవారు నరహరిఁ దలఁచేటి-
ఆనామమంత్రజప మది యొకటే
పూని యాతనిఁ గొలిచి భువి నేజాతైనాను
మోనమునఁ బొందేటిమోక్షమూ నొకటే

చ. 2:

వెనకకు ముందరికి విష్ణుకింకరులకెల్ల
పనివడి కైకొనేటి భక్తి యొక్కటే
వునికి నాదేవుఁడు వొకఁడే అంతర్యామి
మనెడి వైష్ణవకుల మతమెల్లా నొకటే

చ. 3:

భేదాభేదము లేదు పెక్కు మరఁగులు లేవు
ఆదినంత్యములను ముక్తాత్మ లొక్కటే
శ్రీదేవుఁడై నట్టి శ్రీవేంకటేశ్వరుని-
యాదరానఁ బొందు శరణాగతియు నొకటే