పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0308-03 వరాళి సం: 04-045 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను
యజ్ఞాదిఫలరూప మిటు నీవై వుండవే

చ. 1:

పరికించ జీవులకు ప్రాణమవైన నీకు
నిరతిఁ బ్రాణప్రతిష్ఠ నేము సేసేమా
మరిగి మా పూజలంది మమ్ముఁగాచెడికొరకు
హరి నీమూర్తి ప్రాణ మావహించవే

చ. 2:

జగతికి నీపాదజలమే సంప్రోక్షణ
జిగి నీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్ను నేఁడు పావనము సేయుటకు
అగు పుణ్యతీర్థముల అభిషేకమందవే

చ. 3:

వేదములు దెచ్చిన శ్రీవేంకటేశ నేము నీకు
వేదమంత్రముల పూజావిధి సేసేమా
యీదెస నీదాసులమయిన మమ్ముఁ గాచుటకు
వేదమూర్తివై యిందే విచ్చేసి వుండవే