పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-04 ముఖారి సం: 04-440 శరణాగతి

పల్లవి:

ఇదివో తెరమరఁ గిహ పరములకును
వెదకి కన్నమీదఁ విచారమేలా

చ. 1:

హరికుక్షిగతమే యఖిలలోకములెల్ల
నరకము స్వర్గమన్న నయమెంచనేలా
యిరవై యుండినచోనే యిటు హరిదాసుఁడైతే
పరమ పదము నదే భ్రమయఁగనేలా

చ. 2:

అందిరి లోపల హరి యంతరాత్ముఁడై యుండ
యిందును నరసురలని యెంచఁగనేలా
అందిన మనసులో హరి భక్తి గలిగిన-
నందునే మోక్షము దప్ప దనుమానమేలా

చ. 3:

ఘటన శ్రీ వేంకటేశుక ల్పితమై జన్మములు
యిటు సుఖదుఃఖములు యెంచుకొంటేలా
సటలేక యాతని శరణము చొచ్చితేనే
పటు జీవన్ముక్తి యదే పలు మాటలేలా