పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-05 దేశి సం: 04-441 విష్ణు కీర్తనం

పల్లవి:

హరి నీవే సర్వాత్మకుఁడవు
యిరవగు భావన యియ్యఁగదే

చ. 1:

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యఁగదే

చ. 2:

పారక మానదు పాపపు మన సిది
యీరసములతో నెందైనా
నీరజాక్ష యిది నీమయమేయని
యీరీతుల తలఁ పియ్యఁ గదే

చ. 3:

కలుగక మానవు కాయపు సుఖములు
యిల లోపలఁ గల వెన్నైనా
అలరిన శ్రీ వేంకటాధిప నీకే
యిలనర్పితమను యహ మియ్యఁగదే