పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-03 వరాళి సం: 04-439 వైరాగ్య చింత

పల్లవి:

హరిఁ గొలిచినఁగాని ఆపద లణఁగవని
యెరఁగక పొరలితి మిందేమి నిజము

చ. 1:

పుట్టిన దేహమొకటి పొందిన వికారాలఁ
బట్టైన జీవుఁడొకఁడు ప్రాణములేడు
కట్టిడి చిత్తమొకటి కరణములైతేఁ బది
యిట్టిదివో మాజన్మ మిందేది నిజము

చ. 2:

మొదలి ప్రకృతొకటి ముంచిన గుణాలు మూఁడు
కదియు మోహ మొకటి కర్మాలు పెక్కు
పొదలుఁగర్మ మొకటి భోగా లనంతములు
యిదివో మా జన్మ మెంచ మిందేది నిజము

చ. 3:

అంతరాత్మ శ్రీ వేంకటాద్రీశు డొక్కఁడే
చింతించ జీవులైతే సేనాసేన
అంతలో నీతని శరణని బ్రతికితిఁగాక
యెంతలేదు మాజన్మ మిందేది నిజము