పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-02 లలిత సం: 04-438 గురు వందన, నృసింహ

పల్లవి:

అన్నిమంత్రములు నిందే యావహించెను
వెన్నతో నాకుఁ గలిగె వేంకటేశు మంత్రము

చ. 1:

నారదుండు జపియించె నారాయణ మంత్రము
చేరెఁ బ్రహ్లాదుఁడు నారసింహ మంత్రము
కోరి విభిషణుఁడు చేకొనె రామమంత్రము
వేరె నాకుఁగలిగె వేంకటేశు మంత్రము

చ. 2:

రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుఁడు జపించె
నంగవించెఁ గృష్ణమంత్ర మర్జునుఁడును
ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుఁడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము

చ. 3:

యిన్ని మంత్రములకెల్ల యిందిరా నాథుఁడే గురి
పన్నినదిదియే పర బ్రహ్మమంత్రము
నన్నుఁ గావఁ కలిగెఁబో నాకు గురుఁడియ్యఁగాను
వెన్నెలవంటిది శ్రీ వేంకటేశు మంత్రము