పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-06 శంకరాభరణం సం: 04-415 నృసింహ

పల్లవి:

పరగీనదివో గద్దెపై సింహము వాఁడె
పరమైన యౌభళ నారసింహము

చ. 1:

తెల్లని మేని సింహము దేవ సింహము
మెల్లని చిరునవ్వుల మేటిసింహము
చల్లేటియూరుపులతో జయసింహము వాఁడె
బల్లిదుఁడై వెలసే యౌభళ నారసింహము

చ. 2:

నిలుచున్నసింహము నిత్యసింహము
అలరుఁ గొండలమీఁది యాదిసింహము
వెలుపలి కడపపై వీరసింహము
పలుకుఁ బంతము (ల) యౌభళనారసింహము

చ. 3:

పుట్టుజడలసింహము పూర్ణసింహము
ఱట్టడి యార్పుల యాఱడిసింహము
జట్టి గొన్న దాసులకు శాంత సింహము
పట్టపు శ్రీ వేంకటయౌభళ నారసింహము