పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-05 లలిత సం: 04-414 గురు వందన, నృసింహ

పల్లవి:

నేనై విడువవద్దు తానై తగులవద్దు
తానే తానై వుంటేఁ దగులెల్ల నూడు

చ. 1:

పొద్దు వొద్దు హరిఁ దలఁపున దలపోయఁగ
వొద్దికైన పలుచేత లున్న వెల్లా మరచును
నిద్దిరించువాని చేత నిమ్మ పంటివలెనే
బుద్దితోఁ గర్మములు గొబ్బున జారిపోవును

చ. 2:

పలుమారు గురుసేవఁ బరగఁగా బరగఁగా
చలివాసి యాత్మవిజ్ఞానముఁ బొడచూపు
కలగన్నవాఁడు మేలుకనిన కలవలెనే
పలుసంసారములెల్ల భావనలై యుండును

చ. 3:

పక్కన శ్రీ వేంకటేశుపై భక్తి వొడమఁగా
అక్కజపు టిహపరా లరచేతివి యౌను
చొక్కపు పరుసమంటి సొంపుగానిలోహము
నిక్కఁ బైఁడైనట్టు నెరుసెల్లఁ దొలఁగును