పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-01 బౌళి. సం: 04-416 శరణాగతి

పల్లవి:

అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
తడతాఁకులతాపత్రయము మానుపుటకు

చ. 1:

శరణు శరణు వోసర్వేశ్వర నీకు
మరణభయములెల్ల మానుపుటకొఱకు
మొరయొ మొరయొ నీకు ముకుంద మాధవ
దురితములిన్నియుఁ దొలఁగించుటకు

చ. 2:


దండము దండము నీకు దైవశిఖామణి
పండియుఁ బండని మతి పాకముసేయు కొరకు
అండనే దాస్యము దాస్యము నీకు నేనైతి
నిండు నీకరుణ నాపై నించేటి కొరకు

చ. 3:

అభయ మభయము శ్రీయాదినారాయణ
వుభయకర్మము నాకు నూడుచుట కొరకు
విభుఁడ శ్రీ వేంకటేశ వినుతి సేసెద నిన్ను
శుభములన్నియు మాకుఁ జూపేటి కొరకు