పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-02 భూపాళం సం: 04-411 శరణాగతి

పల్లవి:

చిక్కవద్దు చొక్కవద్దు సిలుగుఁ బ్రపంచముల
తక్కిన భోగములెల్లా దైవమే యెరుఁగు

చ. 1:

అంతరంగమునఁ దాను హరిఁ దలఁచినఁ జాలు
అంతటి మీఁదటి పనులాతఁ డెరుగు
పంతమున నాతనిపై భారము వేసినఁ జాలు
వింత వుద్యోగములు గోవిందుఁడే యెరుఁగు

చ. 2:

చేకొని యాతనిరూపు సేవించినఁ జాలు
ఆకడి యీకడి కర్మా లాతఁ డెరుఁగు
తేఁకువ నచ్యుతభక్తి తిరమయ్యినఁ జాలు
దీకొని పరము చూప దేవుఁడే యెరుఁగు

చ. 3:

సాధించి మాధవుని శరణుచొచ్చినఁ జాలు
ఆదియు నంత్యములెల్లా నాతఁ డెరుఁగు
పోదియై శ్రీ వేంకటేశుఁ బూజించినఁ జాలు
పాదుకొని రక్షించఁ బరమాత్ముఁ డెరుఁగు