పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-03 లలిత సం: ౦4-412 మనసా

పల్లవి:

మఱచితిమంటే మరిలేదు
తఱితోఁ దలఁచవో దైవపు మనసా

చ. 1:

పుట్టుచు నున్నది పోవుచు నున్నది
పట్టపు జీవుల ప్రపంచము
నట్టనడుమనే నరహరినామము
గుట్టున దలఁచవో గొనకొని మనసా

చ. 2:

పొద్దు వొడుచునదె పొద్దు గుంకునదె
తిద్దిన జగముల దినదినము
అద్దపు నీడల యంతర్యామిని
వొద్దనె తలఁచెనొనరవొ మనసా

చ. 3:

లోపల వెలుపల లోఁగొనివున్నది
శ్రీపతి మహిమల సృష్టియిదే
యేపున శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడే
దాపని నమ్ముచుఁ దలఁచవో మనసా